Virat Kohli bags ICC Cricketer of the Year award
క్రికెటర్ విరాట్ కోహ్లీ- భారత యువతరానికి అచ్చమైన ప్రతిరూపం. యంగ్ ఇండియాకు నిలువెత్తు నిర్వచనం. ఉరకలేసే యూత్‌కు ఐకాన్. టీమిండియాలో రైజింగ్ స్టార్. మైదానంలో కసిగా కదిలే కోహ్లీ క్రికెట్‌లో తనదైన స్టయిల్‌లో దూసుకు పోతున్నాడు. నిలకడగా రాణిస్తూ భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే తానేంటో నిరూపించుకున్న మొనగాడు. అండర్-19లో దేశానికి ప్రపంచకప్ సాధించిపెట్టి జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఈ ఢిల్లీ కుర్రాడు సీనియర్లతో సమానంగా రాణిస్తున్నాడు. ఏడాది కాలంగా టాప్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడి ఆటకు మన్నన దక్కింది. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లీ ఎంపికయ్యాడు.
‘‘దేని గురించి ఎక్కువగా ఆలోచించను. ఇదే నా సక్సెస్ మంత్ర’’ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లీ స్పందన ఇది. నేటి భారతీయ యువత ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నాయి కోహ్లీ మాటలు. నిజమే తమకేం కావాలో యూత్‌కు స్పష్టంగా తెలుసు. దానికి వారేంచేయాలో వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ఎంత శ్రమ చేసేందుకైనా యువత వెనుకాడదు. ఇదే సమయంలో తమలోని భావోద్వేగాలను దాచుకునేందుకు యూత్ అస్సలు ఇష్టపడరు. సంతోషం, బాధ, కోపం, అసహనం ఏదైనా, ఎవరి ముందైనా ప్రదర్శించేందుకు జంకరు. కోహ్లీ కూడా అచ్చం ఇలాగే ఉంటాడు. వేల మంది ముందు మైదానంలో బెరుకు లేకుండా భావోద్వేగాలు సహజంగా చూపెడుతుంటాడు. ఉడుకు రక్తం ఊరుకోదుగా!
టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్‌తో పోటీ పడి ఐసీసీ అవార్డు గెల్చుకున్న కోహ్లీ భవిష్యత్ సారధిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొలువందుకున్నాడు. అయితే అప్పనంగా అతడికి ఈ పదవి దక్కలేదు. అద్భుత ఆటతీరుతో అందలం అందుకున్నాడు. పరుగుల వర్షంతో ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా వన్నెలీనాడు. గత 12 నెలల కాలంలో 31 వన్డేలు ఆడిన కోహ్లీ 66.65 సగటుతో 1733 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు, అరడజను అర్థశకతాలు ఉన్నాయి. ఆసియాకప్ సిరీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు నమోదు చేశాడు. ఇప్పటివరకు 90 వన్డేలాడిన కోహ్లీ 87 ఇన్నింగ్స్‌లో 3886 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. పది టెస్ట్‌ల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 703 పరుగులు చేశాడు.
కుడిచేత్తో బ్యాటింగ్ చేసే 23 ఏళ్ల కోహ్లీ క్రీజ్‌లో చురుగ్గా కదులుతాడు. పెర్‌ఫెక్ట్ టైమింగ్‌తో బంతిని బౌండరీకి తరలిస్తాడు. టెక్నిక్‌లో ‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్‌కు గుర్తుకు తెస్తాడు. అన్నింటికీ మించి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ మంచి భాగసామ్యాలు నెలకొల్పడంలో రాటు దేలుతున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్‌తో బౌలర్‌గాను నిరూపించుకుంటున్నాడు. ఫీల్డింగ్‌లో చలాకీగా కదులుతుంటాడు. తీవ్ర పోటీ ఉన్న భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్‌లో అతడు టీమిండియా పగ్గాలు చేపట్టడం ఖాయం. ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగితే కోహ్లీ ఫ్యూచర్ సూపర్.
No comments:
Post a Comment